
నందమూరి బ్రహ్మనాయుడు, తొడల సింహారెడ్డి బాలయ్య కి,
అయ్యా ,
ఈ మధ్య ఎలెక్షన్లలో ఆకాశం గర్జించిందా, భూమి కంపించిందా అనిపించేలా మీరు తోడకొట్టటం తో కలియుగాంతమేమో అని భయపడ్డాను. గత అయిదు సంవత్సరాలు కాంగ్రెస్సు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, తొడ కొట్టటం, మీసం తిప్పటంలో మీ వంశానికి మాత్రమే పేటెంట్లు ఉన్న విషయం మరచేపోయాను. అసలు కంటిచూపుతో చంపగల కెపాసిటి ఉన్నా (ఈ విషయం ప్రస్తావిస్తే, బెల్లంకొండ సురేషు "బాలయ్య కి అంత సీను లేదు, రివాల్వరు ఇచ్చినా చంపలేడు" అని అన్నాడు. ఆ విషయం బెల్లంకొండ కి ఎలా తెలుసో?) మీరు ఇలా చీపుగా ప్రతీ ఊరికీ వెళ్లి ఇలా నా లాంటి సామాన్యులని భయపెట్టేటట్టు తొడలు కొట్టటం ఏమీ బాలేదు.
అసలు తొడ కొట్టటం పౌరుషానికి చిహ్నము అని ఎవరు డిసైడు చేసారో కాని, అల నాటి దుర్యోధనుడి మొదలుకొని మీ దాకా అలా తొడలు కొట్టేయటం, మా లాంటి మానవ మాత్రులు భయంతో చావటం మొదలయ్యింది. ఆ దుర్యోధనుడు ఎవరో పరాయి స్త్రీ ముందు తొడ కొడితే, మీరు ఒక ఆకు ఎక్కువే చదివి సొంత చెల్లెలు ఇంటి ముందే కొట్టారు. ఈ విషయంలో మీరు దుర్యోధనుణ్ణి , మీ వంశం కౌరవ వంశాన్ని మించి పోయారు. మీరు అంత కష్టపడి, శివమణి డ్రమ్సు కొట్టినట్టు ఊరూరా తిరుగుతూ తొడలు కొట్టినా ఫలితాలు పెద్దగా తేడా రాలేదు. చరిత్ర చెప్పిందేమిటంటే ఇలా తొడలు కొట్టిన వాళ్ల తొడలు పగిలి, వారి వంశాలు నాశనం అవుతాయి అని. కాబట్టి, ఇలా వీధులలో తొడలు కొట్టకుండా, మీ శత్రువులని కంటి చూపుతో సైలెంటుగా లేపెయ్యండి . లేకపోతే ఇంటికి మందుకి పిలిచి మీ భార్య రివాల్వరు తో చంపండి. కేసు నుంచి తప్పించటానికి మీకు పిచ్చి ఉండనే ఉంది కదా. అలా కాకుండా ఇలా వీధుల్లో తొడలు కొడితే, ఎప్పుడో మీ తొడలు కూడా పగులుతాయి.
అందుకే
కంటి చూపు చాలునయ్యా, గున్నరాయుడూ !!
తొడలు కొట్టి చంపొద్దయ్యా, గున్నరాయుడూ !!
అని చిన్న విజ్ఞ్యప్తి....
భవదీయుడు,
శర్మ